పిఠాపురం నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయిలో పరిశీలన కోసం కార్యాలయ సిబ్బందిని పంపించి, రోడ్ల నాణ్యత, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రహరీ గోడల నిర్మాణం, ప్రజా సేవల అమలుపై నివేదికలు కోరారు.
యూ.కొత్తపల్లి మండలంలోని నాగులాపల్లి సమగ్ర రక్షిత తాగునీటి పథకం విస్తరణ పనులు పూర్తయ్యాయని అధికారులు వెల్లడించగా, త్వరలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని పవన్ కళ్యాణ్ సూచించారు. అలాగే పాఠశాలల్లో శ్రీమతి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం నాణ్యతపై ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు.
పిఠాపురం, గొల్లప్రోలు మున్సిపాలిటీల్లో పారిశుధ్య నిర్వహణలో నిర్లక్ష్యాన్ని సహించబోమని హెచ్చరించిన ఆయన, ఏరియా ఆసుపత్రుల్లో అభివృద్ధి పనులు, 100 పడకల ఆసుపత్రి నిర్మాణం, సీజనల్ వ్యాధుల నివారణ చర్యలపై సమీక్షించారు. అదేవిధంగా నియోజకవర్గంలో 100 భజన మందిరాల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని, రైతులకు సాగునీటి సమస్యలు లేకుండా నీటి విడుదల ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా పిఠాపురాన్ని దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.