ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రత్యేక సందేశాన్ని విడుదల చేస్తూ, సుదీర్ఘ పాలనా అనుభవం కలిగిన చంద్రబాబు గారు తన విజన్‌తో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని కొనియాడారు.
రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్రాన్ని పెట్టుబడుల హబ్‌గా మారుస్తూ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. "మంచి ప్రభుత్వం" అనే నినాదాన్ని నిజం చేస్తూ సాగుతున్న ఈ పాలనలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు గారు నిండు నూరేళ్లూ ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ తన సందేశంలో తెలిపారు.