అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు గారని ఆయన పేర్కొన్నారు. ఆయన చేసిన నిరాహార దీక్ష, ఆత్మబలిదానం ఫలితంగానే తొలి భాషా ప్రాతిపదిక రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని తెలిపారు.
పొట్టి శ్రీరాములు గారి త్యాగం కారణంగానే తరువాత దేశంలో మరిన్ని భాషా ప్రాతిపదిక రాష్ట్రాల ఏర్పాటుకు మార్గం సుగమమైందని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఆయన చేసిన త్యాగాన్ని భవిష్యత్ తరాలు గుర్తుంచుకునేలా అమరావతిలో మెమోరియల్ ట్రస్ట్‌కు ప్రభుత్వం భూమి కేటాయించిందని తెలిపారు.
అలాగే ఆయన 58 రోజుల నిరాహార దీక్షకు గుర్తుగా 58 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఆనందదాయకమని చెప్పారు. రాష్ట్రంలో జల జీవన్ మిషన్ ద్వారా అమలు చేస్తున్న వాటర్ గ్రిడ్ పథకానికి “అమరజీవి జలధార” అని పేరు పెట్టినట్టు పవన్ కళ్యాణ్ గారు తెలిపారు. ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి వ్యక్తికి స్వచ్ఛమైన తాగునీరు అందించే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు.