రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ & పర్యావరణ శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ అటవీ పునరుద్ధరణ కార్యక్రమాలపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 63 లక్షలకు పైగా సీడ్ బాల్స్‌ను 6,500 హెక్టార్ల విస్తీర్ణంలో వెదజల్లినట్లు అధికారులు తెలిపారు. ఇందులో సుమారు వెయ్యి ఎకరాల్లో డ్రోన్ల సాయంతో మనుషులు చేరుకోలేని అటవీ ప్రాంతాల్లో సీడ్ బాల్స్ జారవిడిచారు. వర్షపాతం, నేలలో తేమను పరిగణనలోకి తీసుకొని కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని, అవసరమైతే డ్రోన్ల సంఖ్య పెంచాలని పవన్ కళ్యాణ్ సూచించారు. సీడ్ బాల్స్ వెదజల్లడమే కాకుండా మొలకల సంరక్షణకు కూడా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్య సాధనలో ఈ కార్యక్రమం కీలకమని పేర్కొన్నారు.