ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారు కాకినాడ జిల్లా అభివృద్ధి మరియు ప్రజల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించారు. గురువారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో కాకినాడ జిల్లా కలెక్టర్ శ్రీ ఎం.ఎన్. హరేంద్రప్రసాద్, ఎస్పీ శ్రీ బిందు మాధవ్ గార్లతో ఆయన కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రగతికి సంబంధించి అధికారులకు పలు కీలక దిశానిర్దేశాలు చేశారు.
​ఇకపై ప్రతి రెండు నెలలకు ఒకసారి కాకినాడ, పిఠాపురం నియోజకవర్గాల్లో పర్యటిస్తానని, ప్రజలతో నేరుగా మమేకమై వారి సమస్యలను తెలుసుకుంటానని పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. గ్రామ స్థాయిలో పారిశుధ్య నిర్వహణ, పార్కుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని, ముఖ్యంగా జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికీ తాగునీరు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. "నీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదు. జిల్లా పరిధిలో ఏ ఒక్క రోడ్డుపై గుంతలు కనబడరాదు" అని ఆయన తేల్చిచెప్పారు. ధ్వంసమైన రోడ్ల స్థానంలో కొత్తవి నిర్మించాలని, చిన్న గుంతలను వెంటనే పూడ్చాలని సూచించారు.
​పర్యావరణ పరిరక్షణలో భాగంగా, వర్షాకాలానికి ముందే తీర ప్రాంతం వెంబడి 'గ్రేట్ గ్రీన్ వాల్' ప్రాజెక్టును పూర్తి చేయాలని అటవీ అధికారులను ఆదేశించారు. అలాగే, రేషన్ మాఫియాపై ఉక్కుపాదం మోపాలని, పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీకి స్పష్టమైన సూచనలు చేశారు. పాఠశాలలు, ఆసుపత్రుల పర్యవేక్షణ పెంచాలని, యువతలో నైపుణ్య అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు సూచించారు. కాకినాడ జిల్లా సమగ్ర అభివృద్ధికి జనసేన ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సమావేశం ద్వారా మరోసారి స్పష్టమైంది