హైదరాబాద్‌లోని ఏబీఎన్ – ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీకి సంబంధించిన వ్యక్తులు దాడికి ప్రయత్నించడాన్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు. ఏబీఎన్ – ఆంధ్రజ్యోతి సంస్థల ఎం.డి. శ్రీ వేమూరి రాధాకృష్ణ చేసిన విశ్లేషణను జీర్ణించుకోలేని వైసీపీ నాయకులు దాడులకు దిగడం అప్రజాస్వామికమని ఆయన పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యలు నచ్చకపోతే ప్రజాస్వామ్యరీతిలో సమాధానం ఇవ్వాలి తప్ప, దాడులు చేయడం సరికాదన్నారు.
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కూడా టిడిపి కార్యాలయంపై దాడి చేసి విధ్వంసం సృష్టించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇటువంటి చర్యలను ప్రజాస్వామ్యవాదులు, పత్రిక స్వేచ్ఛను ఆకాంక్షించేవారు ముక్తకంఠంతో ఖండించాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.